contract marriages: ఒక్కో పెళ్లికి 5 లక్షలు... మొత్తం 1000 పెళ్లిళ్లు.. ఇది పాతబస్తీ 'ఖాజీ' గారి ఆల్ టైమ్ రికార్డ్!
- ఐదేళ్లలో 1000 వివాహాలు జరిపించిన ఖాజీ రఫియా
- మతపెద్ద ముసుగులో కాంట్రాక్టు వివాహాలు
- పేద ముస్లిం కుటుంబాలను లక్ష్యం చేసుకునే ఏజెంట్లు
- ఒక్కో పెళ్లికి 5,00,000 రూపాయల చార్జ్
- ముంబైలో కూడా ఖాజీకి ఆఫీసు వుంది
పాతబస్తీలో గ్రేటర్ చీఫ్ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వస్తున్నకొద్దీ పోలీసులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మతపెద్ద ముసుగులో అతను చేసిన వుమన్ ట్రాఫికింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడంటే ఈ ఖాజీ నైజమేంటో ఊహించవచ్చు. అరబ్బు షేకులెవరైనా సరే పెళ్లి కోసం ఖాజీ రఫియాను సంప్రదిస్తారు.
ఇక వారు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగింది మొదలు అన్నీ దగ్గరుండి రఫియానే చక్కబెడతాడు. ఇందుకు తన ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి పనేంటంటే... ముస్లిం బస్తీల్లో అందంగా ఉండే పేదింటి యువతుల అడ్రస్ లు సంపాదించి, వారి తల్లిదండ్రులను ముగ్గులోకి లాగడం.. ప్రధానంగా పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వారిని వంచించడం!
ఖాజీ ఏజెంట్లు ముందుగా సదరు ఆడపిల్ల తల్లిదండ్రులను సంప్రదిస్తారు. వారికి ఆశలు కల్పిస్తారు. గతంలో షేక్ లతో వెళ్లిన వారు మంచి ఇళ్లు కట్టుకున్నారని, ఆనందంగా బతుకుతున్నారని, డబ్బుకు లోటుండదని చెబుతూ లేనిపోని ఆశలు కల్పిస్తారు. వాటికి లొంగితే సరే, లొంగకపోతే వారి బంధువులను రంగంలోకి దించుతారు. వారితో పని కానిచ్చేస్తారు. యువతి సిద్ధం కాగానే గతంలో పెళ్లి కూతురు కోసం ఆర్డర్ ఇచ్చిన షేక్ కు కబురు పెడతారు. అతను హైదరాబాదులో అడుగు పెట్టగానే నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఖాజీ రిసీవ్ చేసుకుని, తన లాడ్జ్ కు తీసుకొస్తాడు.
లాడ్జ్ లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అయితే రోజుకి 5,000 రూపాయల బాడుగ చెల్లించాలి. అలాగే పెళ్లి నిమిత్తం 5,00,000 రూపాయలు చెల్లించాలి. మిగతా కార్యక్రమాలన్నీ ఖాజీ రఫియా చూసుకుంటాడు. బాలిక తల్లిదండ్రులకు 70,000 రూపాయలు ఇస్తాడు. తన ఏజెంట్ కు 2,50,000 రూపాయలు ఇస్తాడు. ఇక మిగిలింది ఖాజీదే. ఒక్కోసారి వివాహాల కోసం ఇతని వద్దకు 25 మంది వరకు షేక్ లు వచ్చేవారంటే రఫియా పనితనం ఏ రీతిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా, అతను చేసిన మొత్తం 1000 పెళ్లిళ్లు కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే చేసేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి కేవలం హైదరాబాదు పాతబస్తీకి మాత్రమే పరిమితం కాదని, ముంబైలో కూడా అతను కార్యాలయం ఓపెన్ చేశాడని, అక్కడ తనిఖీలు నిర్వహించిన తరువాత ఇతగాడి అసలు రంగు బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.