Terrorists: బీఎస్ఎఫ్ జవాను ఇంటికెళ్లి మరీ కాల్చిన చంపిన ఉగ్రవాదులు.. కుటుంబ సభ్యుల ఎదుటే ఘాతుకం!
- కిడ్నాప్ యత్నం ఫలించకపోవడంతో కాల్పులు
- కుటుంబ సభ్యులు అడ్డుకున్నా వదలని ముష్కరులు
- ఉగ్రవాదుల కాల్పుల్లో వారికీ గాయాలు.. పరిస్థితి విషమం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఓ బీఎస్ఎఫ్ జవాను ఇంటికి వెళ్లి మరీ అతడిని కాల్చి చంపారు. బండీపొరాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన లెఫ్టినెంట్ యుమర్ ఫయాజ్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చంపిన ఉగ్రవాదులు తాజాగా బండీపొరాలో ఉంటున్న జవాను మొహమ్మద్ రమ్‌జాన్ పారే (23)ని ఇంటికి వెళ్లి కాల్చి చంపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు, జవాను కుటుంబంలోని మరో నలుగురు గాయపడ్డట్టు తెలుస్తోంది.
పారే కొన్నేళ్ల క్రితమే బీఎస్ఎఫ్‌లో చేరారు. బారాముల్లాలోని 73 బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన గత 20 రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు జవానును కాల్చి చంపినప్పుడు ఆయన ఇద్దరు సోదరులు జావిద్, సాహిబ్, తండ్రి గులామ్, అత్త హెబ్బా బేగం ఉన్నారు. పారేని బలవంతంగా బయటకు తీసుకొస్తున్నప్పుడు వారు అడ్డుకున్నారు. ఏమాత్రం కనికరించని ఉగ్రవాదులు ఆటోమెటిక్ రైఫిల్స్‌తో పారీని కాల్చి చంపారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు కుటుంబ సభ్యులు శ్రీనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఉగ్రవాదులు తొలుత జవానును కిడ్నాప్ చేద్దామనుకున్నారని, అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కాల్చి చంపారని బండీపొరా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జుల్ఫికర్ ఆజాద్ తెలిపారు.