eatable sales: దేశ వ్యాప్తంగా... సిగరెట్ దుకాణాల్లో తినుబండారాల అమ్మకంపై నిషేధం!
- పానీయాలు, చాక్లెట్లు అమ్మకుండా చూడాలని విజ్ఞప్తి
- పొగాకు వినియోగం తగ్గించే ప్రయత్నం
- రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపుల్లో కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అలాగే ఈ ధూమపాన ఉత్పత్తులను విక్రయించే దుకాణాలను స్థానిక మున్సిపల్ అథారిటీలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలనే నిబంధనలు జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడంపైన, దుకాణాల్లో పొగాకు మినహా ఇతర వస్తువుల అమ్మకాలపైన నిషేధం విధించేలా నిబంధనలు జారీ చేయాలని సూచించింది.
పొగాకు వినియోగాన్ని, ధూమపానం చేసే వారి సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తమ రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమల్లోకి తీసుకువస్తామని ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి.
సిగరెట్ దుకాణాల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, పానీయాలు, న్యూస్ పేపర్లు విక్రయించడం వల్ల సిగరెట్ అలవాటు లేని వారు కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోందని, అలా జరగకుండా ఉండటానికే ఈ నిబంధనలు రూపొందించినట్లు ఆరోగ్య శాఖ ఆర్థిక సలహాదారు అరుణ్ ఝా తెలిపారు.