Russia: 2018లో ఫేస్ బుక్ ను నిషేధిస్తాం : రష్యా టెలికాం దిగ్గజం సంచలన ప్రకటన
- నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ సేకరిస్తోంది
- 2014లో రూపొందిన చట్టం ప్రకారం సర్వర్లు రష్యాలోనే ఉండాలి
- ఫేస్ బుక్, ట్విట్టర్ నిబంధనలు పాటించడం లేదు
- లింక్డ్ ఇన్ ను ఇప్పటికే నిషేధించాం
ఫేస్ బుక్ పై నిషేధం విధిస్తామని రష్యా టెలికాం సంస్థ అధినేత అలెగ్జాండర్ ఝరోవ్ హెచ్చరించారు. ఫేస్ బుక్ తమ చట్టాలకు అనుగుణంగా పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. మాస్కోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విదేశీ మెసేజింగ్ సర్వీసులు, సెర్చ్ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్ సైట్లు నిబంధనలకు విరుద్ధంగా రష్యన్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నాయని అన్నారు.
2014లోరష్యాలో రూపొందిన చట్టం ప్రకారం రష్యన్లకు సంబంధించిన సమాచారాన్ని రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు ఈ నిబంధనలు పాటించకుండా రష్యన్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండా తీసుకుంటున్నాయని ఆరోపించారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే 2018లో దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే లింక్డ్ ఇన్ తమ దేశంలో నిషేధం ఎదుర్కొంటోందని ఆయన గుర్తు చేశారు.