Chandigarh: చండీగఢ్‌లో మిల్కా సింగ్ మైనపు బొమ్మ... కలనెరవేరిందన్న ఫ్లైయింగ్ సిక్కు
- కుటుంబం సహా హాజరైన మిల్కా
- జ్ఞాపకాలను పంచుకున్న స్ప్రింటర్
- త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానున్న టుస్సాడ్స్ మ్యూజియం
మైనంతో చేసిన తన బొమ్మను చూసి స్ప్రింటర్ మిల్కా సింగ్ మురిసిపోయాడు. తన కలనెరివేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానున్న మేడం టుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో మిల్కా సింగ్ బొమ్మను ఉంచనున్నారు. ఇప్పటికే తయారీ పూర్తయిన మిల్కా సింగ్ మైనపు బొమ్మను చండీగఢ్‌లో ప్రదర్శనకు ఉంచారు. దీన్ని వీక్షించడానికి మిల్కా సింగ్ కుటుంబంతో సహా హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు.
బ్రిటన్‌లోని కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తాను బంగారు పతకం గెలిచిన తర్వాత లండన్‌లోని టుస్సాడ్ మ్యూజియంకి వెళ్లినట్లు ఆయన తెలియజేశాడు. ఆ మ్యూజియంలో ఉన్న ప్రముఖుల మైనపు బొమ్మలను చూసినపుడు తన బొమ్మ కూడా ఉంటే బాగుండునని ఆశించినట్లు మిల్కా సింగ్ చెప్పాడు.
`నా జీవితం మీద సినిమా వచ్చింది. పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ మైనపు బొమ్మ చూశాక నా జీవితం మరో పదేళ్లు పెరిగినట్లుగా అనిపిస్తోంది` అన్నాడు. మైనపు బొమ్మ ఆహార్యం గురించి మాట్లాడుతూ - `ఈ ఆహార్యం నేను 1960లో లాహోర్ క్రీడల్లో పాల్గొన్నప్పటిది. ఆ సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ నాకు ఫ్లైయింగ్ సిక్కు అని బిరుదునిచ్చాడు` అని వివరించాడు.