Pakistan: పాక్ కు షాక్... ఉగ్రవాదులపై ఎన్ని నివేదికలిచ్చినా చర్యలు లేవని హైకోర్టును ఆశ్రయించిన పాక్ ఐబీ అధికారి

  • ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం లేదని ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించిన పాక్ ఐబీ అధికారి
  • ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై నివేదికలిచ్చినా చర్యలు శూన్యం
  • ఉన్నతాధికారులకే ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి
  • పంజాబ్ విభాగం ఐబీ జాయింట్ డెరెక్టర్ కొడుక్కి నేరుగా ఉగ్రవాదులతో సంబంధం

ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ చేసిన వాదనకు ఊహించని మద్దతు లభించింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై తాను ఇచ్చిన నివేదికలను ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఐబీ అధికారి మాలిక్ ముక్తార్ అహ్మద్ షాజాద్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ దేశంలో కలకలం రేపుతోంది.

దాని వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్న ముక్తార్ అహ్మద్ స్వదేశీ, విదేశీ ఉగ్రవాద సంస్థల వివరాలను ఉన్నతాధికారులకు అందించానని పిటిషన్ లో తెలిపారు. అలాగే ఆ సంస్థలపై ఎన్నో నివేదికలు ఇచ్చానని పేర్కొన్నారు. ఇలా నివేదిక ఇచ్చిన ప్రతిసారీ తనను నిందించారే కానీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

దేశ భద్రతతో ముడిపడిన ఈ అంశంపై నేరుగా ఐబీ చీఫ్‌ ని కలిసినా, ఫలితం శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రధానమంత్రిని కూడా కలిసేందుకు ప్రయత్నించానని ఆయన పిటిషన్ లో తెలిపారు. ఐబీ ఉన్నతాధికారులకు ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తన దర్యాఫ్తులో తేలిందని ఆయన చెప్పారు. అందుకే తన నివేదికలను వారు తొక్కిపెడుతూ, చర్యలకు వెనుకాడుతున్నారని ఆయన తెలిపారు.

పంజాబ్ ఐబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ కుమారుడికి నేరుగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే ఎంతో కీలకమైన ఐబీ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌, డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు బయట దేశాలనుంచి జీతాలు తీసుకొంటున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌, అఫ్ఘానిస్థాన్‌ నిఘా సంస్థలకు సమాచారం చేరవేస్తున్న వారి వివరాలు కూడా తనవద్ద ఉన్నాయని, కజకిస్థాన్‌ లోని ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తున్న ఐబీ పెద్దలు భారీ మొత్తాలను తమ జేబుల్లో వేసుకొంటున్నారని ఆయన వెల్లడించారు.  

  • Loading...

More Telugu News