suresh gopi: కేరళ సూపర్ స్టార్ సురేశ్ గోపీ సంచలన వ్యాఖ్యలు.. వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాలని ఉందన్న వైనం!
- జంద్యం ధరించే వారిని దేవుళ్లుగా పరిగణించాలి
- వచ్చే జన్మలో శబరిమల ప్రధాన అర్చకుడిని అవుతా
- దుమారం రేపుతున్న సూపర్ స్టార్ వ్యాఖ్యలు
కేరళ సూపర్ స్టార్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జంద్యం (యజ్ఞోపవేతం) ధరించే వారందరనీ దేవుళ్లుగా పరిగణించాలని పేర్కొన్నారు. తనకు పునర్జన్మపై నమ్మకం ఉందని, వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిని అవుతానని పేర్కొన్నారు. తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహించిన ‘యోగక్షేమ సభ’కు హాజరైన సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
‘‘పునర్జన్మపై నాకు విశ్వాసం ఉంది. వచ్చే జన్మలో జంద్యం ధరించే కులంలో పుడతా. శబరిమల ప్రధాన పూజారిని అవుతా. ఫలితంగా దేవుడిని స్పృశించొచ్చు. స్నానం చేయించొచ్చు’’ అని సురేశ్ గోపీ పేర్కొన్నారు. అంతేకాదు.. జంద్యం ధరించిన వారినందరినీ దేవుళ్లుగా పరిగణించాలని సూచించారు.
సురేశ్ గోపీ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘పైత్రుకమ్’ అనే ఆయన సినిమాలోని డైలాగును ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ సినిమాలో ఆయన ఓ చోట.. ‘‘నేను బ్రాహ్మణుడిని కాదు. నేను మనిషిని అంతే. నా జంద్యాన్ని తెంపేస్తున్నా. మొలతాడును ఎప్పుడో తొలగించా’’ అని అందులో ఆవేశంగా చెబుతాడు. కాగా, సురేశ్ గోపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.