kinely: నీళ్ల బాటిల్ కోసం రూ. 21 ఎక్కువ చెల్లించాడు... పరిహారంగా రూ. 12వేలు పొందాడు!
- తీర్పు చెప్పిన వినియోగదారుల ఫోరం
- బలమైన సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో గెలుపు
- ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే పరిహారమే
బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర కేపీ తాను కొన్న కిన్లీ వాటర్ బాటిల్‌కు ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంటూ, అమ్మిన షాపు యజమాని మీద, కోకో కోలా కంపెనీ మీద వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఫోరం సంవత్సరం తర్వాత రాఘవేంద్రకు రూ. 12వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఇంతకీ అతను ఎంఆర్‌పీ మీద అదనంగా ఎంత చెల్లించాడో తెలుసా? రూ. 21. రూ. 19 విలువ చేసే కిన్లీ వాటర్ బాటిల్‌ను రూ. 40కి అమ్మారని రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. తయారీ కంపెనీ, షాపు యజమానులు కుమ్మక్కై వినియోగదారులను మోసం చేస్తున్నారని రాఘవేంద్ర ఆరోపించాడు. రాఘవేంద్ర మాటల్లో వాస్తవం లేదని షాపు యజమాని వాదించినప్పటికీ, సాక్ష్యాలు బలంగా ఉండటంతో, వినియోగదారుని వాదనను విశ్వసించిన ఫోరం నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే మీరు కూడా వినియోగదారుల ఫోరంలో కేసు వేయొచ్చు.