peply live: రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. బాలీవుడ్ సహా దర్శకుడిపై కేసు కొట్టివేత!
- పరిచయం ఉండి, గతంలో కలిస్తే, వద్దన్నా అసమ్మతిగా పరిగణించడం కష్టం
- అస్పష్టంగా వద్దని చెప్పడం వెనుక కావాలన్న అర్థమూ దాగుంటుంది
- 'పిప్లీ లైవ్' కో డైరెక్టర్ మహ్మూద్ ఫరూఖీకి ఊరట
విద్యావంతులైన ఓ పురుషుడు, మహిళల మధ్య బాగా పరిచయం ఉండి, గతంలో శారీరక సంబంధం కలిగివుంటే, ఒకసారి లైంగిక చర్యకు సదరు మహిళ 'వద్దు' అంటే దానిని అసమ్మతిగా పరిగణించడం చాలా కష్టమవుతుందని చెబుతూ ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ కో-డైరెక్టర్ మహ్మూద్ ఫరూఖీపై కేసును కొట్టివేసింది. ఓ యూఎస్ రీసెర్చర్ పై అత్యాచారం చేసిన కేసులో ఈ 'పిప్లీ లైవ్' సహ దర్శకుడికి ట్రయల్ కోర్టు ఏడేళ్ల శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించగా, ఢిల్లీ హైకోర్టులో విచారణ అనంతరం ఆయనకు ఊరటనిచ్చింది.
ఈ సందర్భంగా జరిగిన వాదనల అనంతరం న్యాయమూర్తి అశుతోష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అధ్యయనాల ప్రకారం, లైంగిక చర్యల్లో పాల్గొన్న ఆడవాళ్లలో అత్యధికులు తమ చేతలతోనే అంగీకారాన్ని తెలుపుతారని, మహిళల ప్రవర్తన ప్రకారం, భాగస్వామితో అస్పష్టంగా శృంగారం వద్దని చెబితే, దానికి కావాలన్న అర్థం కూడా ఉంటుందని అన్నారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నట్టు వారి ప్రవర్తన ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇక లైంగికదాడి తరువాత, నిజంగానే అంగీకారం లేకుండా జరిగిందా? గతంలో పలుమార్లు కలసినప్పటికీ, ఆ సమయంలో నిందితుడికి, లైంగిక చర్య తనకు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమయ్యేలా ఫిర్యాదిదారు చెప్పిందా? అనే విషయాల్లో నిజానిజాలు వారిద్దరికే తెలుస్తాయని అన్నారు. సంశయలాభం కింద కేసును కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.