hardik pandya: సిక్సర్లు బాదడం నేను కొత్తగా నేర్చుకున్నది కాదు: హార్దిక్ పాండ్య
ఆస్ట్రేలియా సిరీస్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్య తన ప్రదర్శన వెనక ఉన్న రహస్యాన్ని వివరించాడు. ఇలా సిక్సర్లు బాదడం కొత్తగా నేర్చుకున్నది కాదని, చిన్నప్పుడు ఆడిన గల్లీ క్రికెట్ సమయం నుంచే తనకు సిక్సర్లు కొట్టడం అలవాటని పాండ్య చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై చేసిన 76 పరుగులే కెరీర్‌ను మలుపు తిప్పిందా? అనే ప్రశ్నకు హార్దిక్ సమాధానం చెప్పాడు.
‘అలా అనుకోవడం వల్ల ఇబ్బందేం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఐపీఎల్‌లో కూడా నేను బాగానే ఆడాను. కాకపోతే పెద్దగా కలిసి రాలేదు. ఆ అనుభవంతోనే కష్టపడి తిరిగి ఫామ్ సంపాదించుకున్నా. సిక్సర్లు బాదడం చిన్నప్పటి నుంచి అలవాటు వుంది. అలా అని మైదానంలోకి అడుగు పెట్టగానే బాదడం మొదలుపెట్టను. ప్రతిసారీ అదే దూకుడు పనికి రాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి సిక్సర్లు బాదాలి. ఇటీవలి మ్యాచ్‌లో కూడా అదే చేశాను. తొలి మ్యాచ్‌లో జంపా బౌలింగ్‌లో భారీ షాట్లు సాధ్యం అనిపించింది. అందుకే ఏడో ఓవర్ వరకు ఎదురుచూసి, తర్వాత ప్రతాపం చూపించా. దీంతో మ్యాచ్ గమనం మారిపోయింది. అయినా సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇండోర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా భావించా. అందుకే ఎక్కువ బంతులు ఆడి సంతోషంగా వచ్చేశా’ అని పాండ్య అన్నాడు.