trinamool congress: తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎంపీ ముకుల్ రాయ్!
- మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ
- ఐదు రోజుల్లో కారణాలు వెల్లడిస్తానన్న ఎంపీ
- రాజీనామా వెనక బీజేపీ హస్తం?
పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీ ముకుల్ రాయ్ రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ స్థానానికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామాకు వెనక గల కారణాలను మరో ఐదు రోజుల్లో దుర్గా పూజ పూర్తయ్యాక వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో తన తదుపరి కార్యాచరణ గురించి కూడా అప్పుడే ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ముకుల్ రాయ్ బీజేపీ నేతల్ని కలిశారు. కలిసిన కొద్దిరోజులకే ముకుల్ రాయ్ ఇలా రాజీనామా బాంబ్ పేల్చడంతో ఆయన రాజీనామా వెనక బీజేపీ హస్తం ఉండుంటుందని తృణమూల్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా ముకుల్ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారని, కచ్చితంగా ఇది బీజేపీ వాళ్ల కుట్రే అని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క 2015లో శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో రాయ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల పార్టీ ఉపాధ్యక్షుడి హోదా, త్రిపురలో పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. ఈ కారణాల వల్ల కూడా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.