india: దేశం పరువు తీశావంటూ మలీహాపై పాకిస్థానీల తిట్లదండకం!
- ఇండియాను ఇరుకున పెట్టాలన్న ఆత్రుతతో తప్పులో కాలేసిన మలీహా లోదీ
- వెంటనే పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ కు పెరుగుతున్న మద్దతు
- మనం చెప్పేవన్నీ ఇలాగే అసత్యమని అనుకునే పరిస్థితి వచ్చింది
- మలీహా లోధీపై నిప్పులు చెరుగుతున్న పాకిస్థాన్ ప్రజలు
ఐక్యరాజ్యసమితి వేదికపై, ఇండియాను ఇరుకున పెట్టాలన్న తొందర, అత్యుత్సాహంతో పాక్ దౌత్యవేత్త మలీహా లోధీ చేసిన పని ఇప్పుడామెపై తీవ్ర విమర్శలకు కారణమైంది. గాజాలో గాయపడిన ఓ యువతి చిత్రాన్ని ఆమె చూపుతూ, 'కాశ్మీర్ లో మహిళల పరిస్థితి ఇద'ని ప్రకటించి అభాసుపాలుకాగా, దేశం పరువు తీశావంటూ, పాక్ దేశవాసులు ఆమెపై తిట్ల దండకానికి దిగారు.
వెంటనే ఆమెను దౌత్యాధికారి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె చేసిన పని కారణంగా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ పరువు పోయిందని, తమ దేశం చెప్పే అన్ని అంశాలూ ఇలాగే అసత్యాలని నమ్మే పరిస్థితులు వచ్చాయని ఆ దేశ వాసులు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నో అవార్డులు అందుకున్న మూడేళ్ల నాటి ఆ ఫోటోను గుర్తించలేకపోయిన ఆమె, తాను ఓ దేశానికి ప్రతినిధినన్న విషయాన్ని మరచి చౌకబారు ప్రసంగం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు.
కాగా, ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడిన రవయ అబు జోమా అనే యువతి ఫోటోను 2014లో హీదీ లెవిన్ అనే ఫోటోగ్రాఫర్ తీయగా, దీనికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన మలీహా, అదే ఫోటో ప్రింట్ ను ఐరాసలో చూపిస్తూ, కాశ్మీర్ లో యువతులపై భారత సైన్యం అకృత్యాలు జరుపుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శలు చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రసంగం ముగిసేలోపే ఈ ఫోటో కాశ్మీర్ యువతిది కాదని నెటిజన్లు తేల్చేశారు.