farmer: అతనిని వెతికి మరీ పాములు కాటేస్తున్నాయి... భయపడిపోతున్న రైతు!
- నాగుపాములకు లక్ష్యంగా మారిన రైతు
- 2002లో తొలిసారి పొలం దున్నుతుండగా కాటేసిన నాగుపాము
- 2017 మే వరకు మొత్తం 34 సార్లు కాటేసిన నాగుపాములు
- కాళ్లు, చేతుల మీద పాముకాట్ల గుర్తులు
- చికిత్స కోసం 10 లక్షల ఖర్చు
- చావు అంచులను చూసి వచ్చిన రైతు
- నాగుపాములెందుకు పగబట్టాయో తెలియదంటున్న రైతు
పాములకు ఒక రైతు లక్ష్యంగా మారాడు. పదిమందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్న వెతికిమరీ అతన్ని కాటేస్తున్నాయి. ఇప్పటికి 34 సార్లు నాగుపాములు కరవగా, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీని వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ ఉప్పలూరివాండ్ల పల్లెకు చెందిన కె.సురేంద్రనాథ్ రెడ్డి సాధారణ రైతు. 2002 జూన్ లో సురేంద్రనాద్ రెడ్డి ఊరికి సమీపంలో పొలం దున్నుతుండగా భూమిని చీల్చుకొంటూ వెళ్తున్న మడకలోంచి బయటకొచ్చిన నాగుపాము ఆయన కాలిని కాటేసింది. వెంటనే వైద్య చికిత్స తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక అప్పటినుంచి అతనిపై పాముల వేట మొదలైంది.
ఇంట్లో ఉంటే తప్ప మరెక్కడా ఆయనకు రక్షణ లేకుండాపోయింది. 2017 మే 29 వరకు మొత్తం 34 సార్లు అతనిని నాగుపాములు కాటేశాయి. అవి వేసిన కాట్లు ఆయన కాళ్లు, చేతులపై ముద్రల్లా నిలిచాయి. నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం రాగా, ఒకసారి కాటేసిన పామును తన వెంట తీసుకొచ్చాడు. దీంతో వైద్యులు అతనిని తీసుకొచ్చిన ప్రతిసారీ చికిత్స అందిస్తున్నారు. నాగుపాము కాటేసిన ప్రతిసారి నోరు, ముక్కులోంచి రక్తం, నురగ రావడంతో చావు అంచులదాక వెళ్లొస్తున్నాడు.
అయితే తన చికిత్సకు శక్తికి మించి ఖర్చు చేశాడు. సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేశాడు. దీంతో ఆర్థికంగా చితికిపోయాడు. మందుల కారణంగా శరీరం నిస్సత్తువగా మారింది. ఎక్కువ దూరం నడవలేడు. మునుపటిలా కష్టపడి సేద్యం చేయలేడు. వర్షంలో తడిస్తే వాపులు, గుల్లలు వస్తాయి. దీనికి విరుగుడుగా వేడి పదార్థాలను తీసుకుంటాడు. అయితే పాములు తనపై ఎందుకు పగబట్టాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.