Mulayam Yadav: తండ్రీ కొడుకుల మధ్య మరింత పెరిగిన దూరం.. కొత్తపార్టీతో వచ్చేస్తున్న ములాయం సింగ్ యాదవ్.. నేడే ప్రకటన!
- పార్టీ సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ములాయం కినుక
- పార్టీలో చీలిక తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు
- ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య మొదలైన విభేదాలు ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తాము తిరిగి కలిసిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసినా ములాయం మాత్రం తనకు జరిగిన అవమానానికి లోలోన రగిలిపోతూనే ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశానికి ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌లకు ఆహ్వానం అందలేదు. దీనిని మరింత అవమానంగా భావించిన ములాయం ఇప్పుడు పార్టీలో చీలిక తెచ్చేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘లోక్‌దళ్’తో కలిసి నేడు (సోమవారం) ఆయన కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
ములాయం 25 ఏళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీని ప్రారంభించారు. రెండు రోజుల క్రితం జరిగిన స్టేట్ కన్వెన్షన్ పార్టీకి తమకు ఆహ్వానం అందలేదని ములాయం, శివపాల్ యాదవ్‌లు పేర్కొన్నారు. దీంతో కినుక వహించిన ములాయం కొత్త పార్టీ స్థాపనకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ములాయం సోమవారం లోహియా ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లోక్‌దళ్‌తో కలిసి కొత్త పార్టీని ప్రకటిస్తారని లోక్‌దళ్ అధ్యక్షుడు సునీల్ సింగ్ తెలిపారు. కొత్త పార్టీలో ‘సమాజ్‌వాదీ’ అనే పదం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నకిలీ సమాజ్‌వాదీ’లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం.
లోక్‌దళ్ పార్టీని 1980లో సోషలిస్ట్ నేత చరణ్ సింగ్ స్థాపించారు. అప్పట్లో ములాయం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ‘పొలం దున్నుతున్న రైతు’ ఆ పార్టీ గుర్తు. ఇదే గుర్తుపై పోటీ చేసిన చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.