india: ఎవరిది తప్పో తేలుద్దామా? అంతర్జాతీయ విచారణకు సిద్ధమా?: భారత్ కు పాకిస్థాన్ సవాల్
- యుద్ధ నేరాలకు పాల్పడేది భారతే
- గొప్పలు చెప్పుకోవడం తప్ప మరేమీ లేదు
- గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఏలుతోంది
- పాక్ తరఫున విరుచుకుపడ్డ మలీహా లోధీ
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్థానేనని, ఆ దేశం మానవ హక్కులకు విఘాతం కలిగిస్తోందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఐరాస వేదికపై చేసిన ప్రసంగాన్ని పాక్ తప్పుబట్టింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ 72వ సెషన్ లో పాల్గొన్న ఐరాసలో పాక్ శాశ్వత సభ్యురాలు డాక్టర్ మలీహా లోధీ, సుష్మా ప్రసంగంపై స్పందిస్తూ, కాశ్మీర్ లో భారత సైన్యమే యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయి విచారణకు ఇండియా సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. దక్షిణాసియాలో ఎటువంటి ఉగ్రవాదానికైనా తల్లి ఇండియానేనని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకుంటోందని, వాస్తవం చాలా మందికి తెలియదని ఆమె అన్నారు. సైన్యం ఉపయోగించిన పెల్లెట్స్ తో గాయపడిన ఓ కాశ్మీర్ మహిళ చిత్రాన్ని ఆమె చూపించారు.
'ఇదే భారత ముఖచిత్రం' అని ఆమె అనడం గమనార్హం. ఇండియాలో అంతర్గత రాజకీయాలు అధికమని, మోదీ ఆలోచనలన్నీ మతచాందసమేనని, వివక్షాపూరితమని తీవ్ర ఆరోపణలు చేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇప్పటి భారత ప్రజా ప్రతినిధులు వారసత్వంగా అందుకున్నారని ఆరోపించారు. అటువంటి ఓ కరుడుగట్టిన వ్యక్తిని ఇండియాలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని, యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.