north korea: ఉత్తర కొరియా తీరంలో మోహరించిన అమెరికా బాంబర్లు, ఫైటర్ జెట్స్!
- అణు ప్రకంపనల ధాటికి స్వల్ప భూకంపం
- వెంటనే స్పందించి తమ బలాన్ని చూపిన అమెరికా
- కొరియా తీరంలో అత్యాధునిక యుద్ధ విమానాలు
శనివారం నాటి ఉత్తర కొరియా అణు పరీక్షల తరువాత, స్వల్ప భూకంపం నమోదు కావడం, మరో వారం వ్యవధిలో ఇంకో అణు పరీక్షకు ఆ దేశం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా తీరంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ బీ-1బీ లాన్సర్ బాంబర్లు, ఫైటర్ జెట్ విమానాలను మోహరించింది. ఈ విమానాలు అంతర్జాతీయ జలాలపై విన్యాసాలు చేస్తూ, పెంటగాన్ సత్తాను చూపిస్తున్నాయి. అమెరికా ముందు సైనిక చర్యలు సహా చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఉత్తర కొరియా ప్రభుత్వానికి వెల్లడించే ఉద్దేశంతోనే విమానాలను మోహరించి విన్యాసాలు జరుపుతున్నామని పెంటగాన్ ప్రతినిధి డనా వైట్ వెల్లడించారు. ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూ, సమస్య తీవ్రతను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాగా, గడచిన వారం రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ట్రంప్ రెచ్చిపోగా, అంతే స్థాయిలో ఉత్తర కొరియా బదులిచ్చింది. ఇరు దేశాధి నేతలూ ఒకరిని ఒకరు కుక్కలతో పోల్చుకున్న సంగతీ తెలిసిందే. ఆపై రెండు రోజుల వ్యవధిలోనే మరో అణు పరీక్షకు దిగడం, దాని తీవ్రతకు భూకంపం రావడంతో అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. ఉత్తర కొరియా అణు పరీక్షలను నిశితంగా గమనిస్తున్నామని సీటీబీటీఓ (కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్) పేర్కొనడం గమనార్హం.