dasara: దసరా ప్రయాణం: ఏ బస్టాండు నుంచి ఎక్కడికి బస్సులుంటాయి... హైదరాబాదీలకు విలువైన సమాచారం!
- అన్ని బస్సులూ ఎంజీబీఎస్ కు రావు
- రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు బస్సులు సీబీఎస్ నుంచి
- నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు జేబీఎస్ నుంచి
- విజయవాడ, విశాఖకు ఎల్బీ నగర్ నుంచి
దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ శివార్ల నుంచే బస్సులు గమ్యస్థానాలకు బయలుదేరుతాయని, ప్రజలు దాన్ని గమనించి, ఏ బస్టాండుకు వెళితే, ఎక్కడికి బస్సులు లభిస్తాయో ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు. సాధారణ రోజుల్లోలా అన్ని బస్సులూ ప్రధాన బస్టాండైన ఎంజీబీఎస్ కు రావని స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరుతాయని తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీ, బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరే ఈ ప్రాంత బస్సులు తార్నాక లేదా అత్తాపూర్ మీదుగా ఎల్బీ నగర్ చేరుతాయని పేర్కొన్నారు. ఇక వరంగల్ రూట్ బస్సులు ఉప్పల్ బస్టాండు నుంచి బయలుదేరుతాయని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ రూట్ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని చెప్పారు. ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎంజీబీఎస్ ఎదురుగా ఉండే పాత బస్టాండ్ (సీబీఎస్) నుంచి బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాలకు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.