narendra modi: ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే సరిపోదు, పూర్తి చేయాలి: ప్రధాని మోదీ
- యూపీ గత ప్రభుత్వాలను ఎండగట్టిన ప్రధాని
- వారణాసిలో పర్యటిస్తున్న మోదీ
- త్వరలో రానున్న లోక్‌సభ ఉప ఎన్నికలే కారణమా?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ అక్కడ దాదాపు రూ. 1000 కోట్లు విలువైన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
`సాధారణంగా ప్రాజెక్టుల శంకుస్థాపన ఒక ప్రభుత్వం చేస్తే, దాని నిర్మాణం పూర్తి చేసేది మరో ప్రభుత్వం. ఇలా జరగడానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం పనితీరులో లోపమే. కానీ మా ప్రభుత్వం అలా కాదు. మేమే శంకుస్థాపన చేస్తాం. మేమే నిర్మాణం పూర్తి చేస్తాం. మేమే ప్రారంభిస్తాం` అని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా గతంలో యూపీలో వివిధ ప్రభుత్వాల పనితీరును ఆయన ఎండగట్టారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ప్రజల సొమ్మును వారి అభివృద్ధి కోసం కాకుండా ఎన్నికల్లో విజయం కోసమే ఖర్చుపెట్టారని మోదీ అన్నారు. ఇటీవల యోగి ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యలు యూపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ఎన్నికవడంతో వారి ఎంపీ స్థానాలైన గోరఖ్‌పూర్, ఫుల్పుర్‌లలో వచ్చే ఆర్నెల్లలో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకునే మోదీ గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రసంగంలో గుర్తుచేసుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.