kcr: లక్ష కోట్లతో 'మిషన్ హైదరాబాద్'కు కేసీఆర్ రూపకల్పన!
- మరో భారీ మిషన్ కు కేసీఆర్ శ్రీకారం
- హైదరాబాద్ రూపురేఖలు మార్చడమే లక్ష్యం
- లక్ష కోట్ల బడ్జెట్
ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా మరో భారీ మిషన్ కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రూపు రేఖలు మార్చేందుకు మిషన్ హైదరాబాద్ కు రూపకల్పన చేస్తున్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మిషన్ ను చేపట్టనున్నారు.
హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మిషన్ ను చేపట్టనున్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ పేరొందినా... నగరంలో సమస్యలు మాత్రం చెప్పలేనన్ని ఉన్నాయి. చిన్న వాన పడితే చెరువులను తలపించే రోడ్లు, గతుకుల రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు నిజాం కాలంనాటి డ్రైనేజ్ పైపులు ఒత్తిడికి లోనై పగిలిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, హైదరాబాదుకు భారీ ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే... మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. మిషన్ హైదరాబాదులో ఏయే అంశాలను చేర్చాలనే దానిపై ఇప్పటికే ప్లాన్ రూపుదిద్దుకుంటోంది.