flee after spotting man: రైల్లో గోళ్లు తీసుకుంటోన్న వ్యక్తిని చూసి.. ఉగ్రవాది అనుకొని పారిపోయిన ప్రయాణికులు
- లండన్ లోని ట్యూబ్ ట్రైన్లో ఘటన
- ఆ వ్యక్తిని ఉగ్రవాదిగా భావించిన ప్రయాణికులు
- టిక్.. టిక్.. టిక్మంటూ చప్పుళ్లు రావడంతో భయం
- వీడియో వైరల్
ప్రపంచ వ్యాప్తంగా రోజుకో చోట దాడులు జరుపుతూ ఉగ్రవాదులు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పోలీసులు చేస్తోన్న హెచ్చరికలు వారిలో భయాన్ని నింపుతున్నాయి. ఉగ్రవాదుల భయంతో అనుమానాస్పదంగా ఎవరయినా కనిపిస్తే పరుగులు తీస్తున్నారు. ఇటువంటి ఘటనే లండన్లోని ఓ రైల్లో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడి ప్రజలను పోలీసులు బాగానే అప్రమత్తం చేశారు. దీంతో ప్రజలు అతి జాగ్రత్త కనబర్చారు.
పిక్కాడిల్లీ నుంచి కాక్ఫస్టర్స్ వెళుతున్న ట్యూబ్ ట్రైన్లో ఓ ప్రయాణికుడు రైల్లోకూర్చుని గోళ్లు తీసుకుంటున్నాడు. ఈ సమయంలో టిక్.. టిక్.. టిక్మంటూ చప్పుళ్లు రావడంతో ఇతర ప్రయాణికులంతా భయపడిపోయారు. అతడు కిందికి చూస్తూ ఏదో బాంబు పేల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రయాణికులు అనుకున్నారో ఏమో.. రైల్లో అతడికి దూరంగా పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఆ రైల్లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు గమనించి వీడియో తీశాడు. తదుపరి స్టేషన్ రాగానే రైల్లోని వారంతా కిందకు దిగేశారని ఆయన చెప్పాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది.