ndtv: ఎన్డీటీవీని సొంతం చేసుకోనున్న స్పైస్ జెట్ అజయ్ సింగ్... ఇన్వెస్టర్లు ఎగబడటంతో అప్పర్ సర్క్యూట్ ను తాకి ఆగిన ట్రేడింగ్
- నిమిషాల్లో 5 శాతం పెరిగిన ఈక్విటీ
- చేతులు మారిన 23 వేల వాటాలు
- పెండింగ్ లో 2.18 లక్షల ఈక్విటీలకు కొనుగోలు ఆర్డర్
ఎన్డీటీవీగా సుపరిచితమైన న్యూఢిల్లీ టెలివిజన్ సంస్థను స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ సొంతం చేసుకోనున్నారని, ఇప్పటికే ఆయన మెజారిటీ వాటాలను కొనుగోలు చేశారని వచ్చిన వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. ఒక్కసారిగా ఎన్డీటీవీ వాటాలను సొంతం చేసుకునేందుకు పెద్దఎత్తున ఇన్వెస్టర్లు ఎగబడటంతో ఈ ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఎన్డీటీవీ ఈక్విటీ విలువ 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకింది. ఉదయం 9.25 గంటల సమయానికి 23,402 వాటాలు చేతులు మారేవరకు క్రితం ముగింపుతో పోలిస్తే 5 శాతం పెరిగి రూ. 53.10కు ఎన్డీటీవీ ఈక్విటీ విలువ చేరుకుంది. దీంతో అధికారులు ట్రేడింగ్ ను నిలిపివేశారు. అప్పటికే ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో 2.18 లక్షల ఈక్విటీల కోసం కొనుగోలు ఆర్డర్లు పేరుకుపోయాయి.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లతో పాటు ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నడుస్తూ ఉండటంతో సంస్థ ఈక్విటీ గత కొద్దికాలంగా దిగజారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ యాజమాన్యం మారనుందని, అజయ్ సింగ్ చేతుల్లోకి వెళ్లనుందని 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' శుక్రవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈక్విటీ విలువ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఆగస్టు 9న ఏడాది కనిష్ఠ స్థాయిలో రూ. 33.50 వద్ద ఉన్న ఎన్డీటీవీ ఈక్విటీ విలువ ఐదు వారాల వ్యవధిలో 80 శాతం వరకూ పెరగడం గమనార్హం. ఇక ఇదే వార్త స్పైస్ జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించగా, ఆ సంస్థ ఈక్విటీ 2 శాతం నష్టపోయి రూ. 143 వద్ద కొనసాగుతోంది.