pula nagaraju: అనంతపురం జడ్పీ చైర్మన్ గా పూల నాగరాజు ఏకగ్రీవం!
- గైర్హాజరైన వైకాపా జడ్పీటీసీ సభ్యులు
- నామినేషన్ వేసింది నాగరాజు ఒక్కరే
- నేడే ప్రమాణ స్వీకారం
- మూడేళ్లు చైర్మన్ గా చమన్
- ముందస్తు డీల్ ప్రకారం నాగరాజుకు అవకాశం
కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక జరుగగా, గుమ్మగట్ట నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన తెలుగుదేశం నేత పూల నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు వైకాపా నుంచి గెలుపొందిన జడ్పీటీసీలు గైర్హాజరు కావడంతో ఆయన ఎన్నిక సాఫీగా సాగింది. అంతకుముందు జెడ్పీ కార్యాలయ సభా మందిరం వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్పీ సీఈఓ శోభా స్వరూపరాణితో కలిసి జాయింట్ కలెక్టర్ రమామణి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసిన తరువాత ఎన్నిక ప్రక్రియ మొదలైంది.
నేటి ఉదయం నామినేషన్ దాఖలు సమయం మొదలైన తరువాత పూల నాగరాజు ఒక్కరే నామినేషన్ వేశారు. ఆపై మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్వరూపరాణి ప్రకటించారు. ఆయనతో నేడే ప్రమాణ స్వీకారం చేయించనున్నామని వెల్లడించారు. అంతకుముందు, టీడీపీ నేతలు ముందస్తు జాగ్రత్త చర్యలకు దిగి, ఏ విధమైన రభసా జరుగకుండా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగాలని, సభ్యులంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. గడచిన మూడేళ్లుగా చమన్ చైర్మన్ పీఠంపై ఉండగా, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఇప్పుడా పదవి పూల నాగరాజును వరించింది.