honeypreet: పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చాం... హనీప్రీత్ మా దేశంలో లేదు: తేల్చి చెప్పిన నేపాల్ సీబీఐ
- ఆమెను చూసినట్టు కొందరు చెప్పారు
- అదే విషయాన్ని ఇండియాకు వెల్లడించాం
- కానీ ఆమె ఆచూకీ లభించలేదు
- నేపాల్ సీబీఐ డైరెక్టర్ స్పష్టీకరణ
తమ కుమార్తెగా డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ చెప్పుకున్న హనీప్రీత్ సింగ్ నేపాల్ లో తలదాచుకుందన్న వార్తలు అవాస్తవమని ఆ దేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేసింది. ఆమె కదలికలపై గతంలో తామిచ్చిన సమాచారం అవాస్తవమని నేపాల్ సీబీఐ డైరెక్టర్ పుష్కర్ కార్కి వెల్లడించారు.
"కొంతమంది భీరత్ నగర్ పరిసరాల్లో ఆమెను చూసినట్టు సమాచారం ఇచ్చారు. మరికొందరు పశ్చిమ నేపాల్ లో చూసినట్టు తెలిపారు. ఖాట్మండులో కనిపించినట్టూ వార్తలు వచ్చాయి. ఇదే సమాచారాన్ని ఇండియాకు మేము పంచుకున్నాం. కానీ, ఈ వార్తలన్నీ తప్పు" అని ఆయన అన్నారు. చిన్న పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పటికీ హనీప్రీత్ తమ దేశంలో ఉందేమోనని విచారణ జరుపుతున్నామని అన్నారు.
కాగా, ఆమె రాజస్థాన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఈ విషయంలో పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం. ఈ నెల 18న హర్యానా పోలీసులు హనీప్రీత్ సహా 43 మంది పేర్లతో వాంటెడ్ లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.