south Korea: కిమ్ జాంగ్ ఉన్ భయానికి కారణం ఇదే!: అమెరికా ప్రొఫెసర్ విశ్లేషణ
- సద్దాం హుస్సేన్ ను హతమార్చిన తరువాత ఇరాక్ పరిస్థితి ఏంటి?
- గడాఫీని హతమార్చిన తరువాత లిబియా పరిస్థితి ఏంటి?
- ప్రతిరోజూ ఉదయాన్నే దాడులు చేస్తామన్నంతగా కిమ్, ట్రంప్ ప్రకటనలు
- అణ్వాయుధాలు రూపొందించుకోవడం ఉత్తరకొరియా హక్కు
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భయానికి కారణం ఉందని అమెరికాలోని టెరెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొలిన్ అలెగ్జాండర్ అంటున్నారు. ఆ యూనివర్సిటీలో రాజకీయ, సమాచార శాస్త్రాన్ని బోధించే ఆయన...తెల్లారి లేస్తే చాలు, యుద్ధం మొదలు పెట్టేస్తామన్న రీతిలో అమెరికా, ఉత్తరకొరియాలు స్పందిస్తున్నాయని అన్నారు. ఈ రెండు దేశాల అధ్యక్షుల కోరిక ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రతిరోజూ యుద్ధం మొదలు పెట్టేరీతిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారని ఆయన తెలిపారు. అయితే ఉత్తరకొరియా అణ్వాయుధాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కివక్కాణించారు.
ఎందుకంటే 'ఉత్తరకొరియాపై దాడి చేస్తాం, ఆ దేశాన్ని నాశనం చేస్తాం, ఆ దేశంపై దాడి చేయడం ఆపిల్ కోసినంత తేలిక' అంటూ ట్రంప్ ప్రకటనలు చేస్తుంటే ఏ దేశాధ్యక్షుడైనా ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు. కిమ్ తన దేశం గురించి ఆందోళన చెందుతున్నాడని ఆయన తెలిపారు. గతంలో ఆమెరికా దాడులు చేసిన ఇరాక్, లిబియాల పరిస్థితిని గుర్తు చేశారు. ఇరాక్ పై అమెరికా దాడికి దిగకముందు ఆ దేశంలో శాంతి భద్రతలన్నీ అదుపులో ఉండేవని ఆయన గుర్తు చేశారు. అయితే అణ్వాయుధాలున్నాయన్న ఆరోపణలతో సద్దాం హుస్సేన్ ను హతమార్చిన తరువాత ఆ దేశ పరిస్థితి ఎలా తయారైందో గుర్తించాలని ఆయన అన్నారు.
అలాగే లిబియాలో గడాఫీ ఉన్నప్పుడు ఆందోళనలు ఉన్నప్పటికి, ఇప్పటికి తేడా చూడాలని ఆయన సూచించారు. ఈ రెండు దేశాల పరిస్థితి చూశాక ఎప్పుడో ఒకప్పుడు తనకు కూడా అదే గతి పడుతుందేమోననే కిమ్ ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ భయంతోనే ఆయన అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాడని ఆయన చెప్పారు. అలా చేసుకోవడం వరకు మంచిదే కానీ, వాటితో అమెరికాలోని ప్రధాన నగరాలను నాశనం చేస్తానని ప్రకటించడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.