tomato: నిన్న రూ. 25, నేడు రూ. 8... ఒక్కసారిగా పాతాళానికి టమోటా ధర
- హైదరాబాద్ కు భారీగా తరలివచ్చిన పంట
- ధర పడిపోవడంతో రైతుల దిగాలు
- గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
టమోటా రైతు పరిస్థితి ఒక్క రోజులో దయనీయమైంది. నిన్నటి వరకూ నాణ్యతను బట్టి కిలోకు రూ. 25 వరకూ పలికిన టమోటా ధర, నేడు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ఈ ఉదయం హైదరాబాద్ మార్కెట్ కు భారీ ఎత్తున టమోటాలను రైతులు తీసుకురావడంతో వాటిని కొనుగోలు చేసే వారు కరవయ్యారు. దీంతో కిలో ధర రూ. 8కి పడిపోయింది. బోయిన్ పల్లి, కొత్తపేట తదితర మార్కెట్లలో టమోటాలకు ధర పడిపోవడంతో రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం సరకు రవాణా చార్జీలు కూడా రాని పరిస్థితి నెలకొందని, అమ్ముడుపోని పంటను వెనక్కు తీసుకెళ్లే అవకాశం కూడా లేదని వాపోయారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న రైతులు నిరసనలకు దిగారు.