north korea: ట్రంప్ మాటలు కుక్క అరుపులే!: న్యూయార్క్ లో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి
- కుక్కలు అరుస్తున్నా మా నడక ఆగదు
- ఒంటరి చేయాలన్న ట్రంప్ ఎత్తుగడ సాగదు
- ఉత్తర కొరియాను రక్షించుకోవడం తెలుసు
- విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో
తాను తలచుకుంటే ఉత్తర కొరియాను సర్వ నాశనం చేస్తానని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఉత్తర కొరియా కొట్టి పారేసింది. ట్రంప్ మాటలను కుక్క అరుపులతో పోల్చిన ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో, ఇటువంటి అరుపులను తాము పట్టించుకోబోమని అన్నారు. మంగళవారం నాడు ట్రంప్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఉత్తర కొరియాకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక యూఎన్ సమావేశాల నిమిత్తం న్యూయార్క్ కు వచ్చిన రీ యాంగ్ హో, ట్రంప్ ప్రసంగంపై మండిపడ్డారు. కుక్కల అరుపులు కొనసాగుతున్నా తమ నడక ఆగదని, తనను చుట్టుముట్టిన విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాను ఒంటరి చేయాలన్న ఏ దేశపు ఎత్తుగడలూ సాగబోవని, తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసునని ఆయన అన్నారు. అణు క్షిపణి సామర్థ్యం పెంచుకోవాలన్న నిర్ణయం దేశ భద్రత కోసమేనని స్పష్టం చేశారు. ఎన్నో దేశాలు తమకు మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.