china: అమెరికాపై కసి మామీద చూపిస్తున్నాడు: కిమ్ జాంగ్ ఉన్ పై చైనీయుల ఆగ్రహం

  • కిమ్ జాంగ్ ఉన్ పై ఈశాన్య చైనీయుల ఆగ్రహం
  • అంతర్జాతీయ సరిహద్దుల్లో అణు పరీక్షలు నిర్వహించకూడదు
  • హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం ఆ ప్రాంతంలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది
  • సరిహద్దుల్లో రేడియేషన్ పెరుగుతోంది
  •  ప్రజలు వలసలు పోతున్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై చైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాపై కసిని తమపై తీర్చుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా, వరుస అణుక్షిపణి పరీక్షలు, హైడ్రోజన్ బాంబు పరీక్షలతో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఈశాన్య చైనాలోని మూడు ప్రావిన్సులకు దగ్గర్లో జరుగుతున్నాయి. హైడ్రోజన్ బాంబు పరీక్షపై వీరంతా బహిరంగ ఆందోళన తెలిపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు యు యెన్‌‌ ఫెంగ్ ఆందోళనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబుని పరీక్షించిన తరువాత తమ ప్రాంతాల్లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. దేశాల సరిహద్దుల్లో అణు పరీక్షలు నిర్వహించకూడదన్న సూత్రాన్ని ఉత్తరకొరియా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ దేశం నిర్వహించిన అణు పరీక్షల వల్ల తమ ప్రాంతంలో క్రమంగా రేడియేషన్ పెరుగుతోందని ఆయన అన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు. అమెరికాపై కసితో కిమ్ జాంగ్ ఉన్ చైనా సరిహద్దు ప్రాంతాలను శ్మశానంగా మార్చేలా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News