chandrababu: సహజంగా మరణించినా రూ. 2 లక్షలు: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు
- త్వరలోనే విధివిధానాలు వెల్లడి
- కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు
- ప్రస్తుత వృద్ధి రేటు 11.72 శాతం
- సమష్టి కృషితోనే సాధ్యమైందన్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. ఈ ఉదయం కలెక్టర్లతో రెండు రోజుల కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో సహజమరణం పొందిన వారికి కూడా రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకానికి కొంత వయో పరిమితిని విధిస్తామని, అది 50 ఏళ్లా, 60 ఏళ్లా అన్నది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. నిర్దేశిత వయసులోగా సహజమరణం పొందితే, వారి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ఈ డబ్బు ఉపకరిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు 11.72 శాతంగా ఉందని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అధికారీ నిజాయితీగా పనిచేస్తున్నారని, కొన్ని చోట్ల అవినీతి ఉన్నా, దాన్ని నెమ్మదిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఏడు మిషన్లు, గ్రిడ్లను వృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, రియల్ టైమ్ మేనేజ్ మెంట్ ఏపీని వృద్ధిలోకి తీసుకు వెళుతోందని చెప్పారు. జిల్లాల పనితీరులో 'ఏ' ప్లస్ రేటింగ్ ను కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలు సాధించాయని వెల్లడించిన చంద్రబాబు, కడప, విశాఖ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు 'ఏ' గ్రేడ్ లభించిందని అన్నారు. ఈ జిల్లాలు పాలనలో మరింతగా మెరుగుపడాల్సి వుందని తెలిపారు.