digital payments: త్వరలో అందుబాటులోకి రానున్న కొత్తరకం డిజిటల్ చెల్లింపుల సిస్టం!
- కనుసైగతో, ఫింగర్‌ప్రింట్‌తో డబ్బులు చెల్లించే అవకాశం
- సన్నాహాల్లో మాస్టర్ కార్డ్ కంపెనీ
- స్టార్టప్‌లకు సదవకాశం
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల సంఖ్య విపరీతంగా పెరిగింది. పేటీఎం, భిమ్, ఈ మధ్య వచ్చిన గూగుల్ తేజ్ ఇలా చాలా డిజిటల్ చెల్లింపుల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులు చేయడంలో కొత్త కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటికే క్యూఆర్ కోడ్ స్కానింగ్, వన్ టైమ్ పాస్వర్డ్ లాంటి డిజిటల్ చెల్లింపు సేవలను ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. మున్ముందు కంటిరెప్పలు వాల్చడం ద్వారా, ఫింగర్‌ప్రింట్ ద్వారా, సాధారణ మొబైల్ నుంచి కూడా చెల్లింపులు చేసే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మాస్టర్‌కార్డ్ వంటి సంస్థలు బ్యాంకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డులకు బయోమెట్రిక్ వివరాలను చిప్ ద్వారా అనుసంధానం చేస్తే, చెల్లింపులు చేసే ముందు పిన్ ఎంటర్ చేయకుండా కేవలం వేలిముద్ర స్కానింగ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇటీవల ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ప్రవేశ పెట్టిన ఫేస్ ఐడీ టెక్నిక్ ద్వారా చెల్లింపులు చేసేటపుడు ముందు కెమెరా ఆన్ చేసి కనుసైగతో చెల్లింపులు చేయవచ్చు. దీన్ని `బ్లింక్ అండ్ పే` అంటారు.
ఇక గూగుల్ `తేజ్` యాప్‌లో ధ్వని పౌనఃపున్యం ద్వారా కూడా చెల్లింపులు చేసుకునే సదుపాయం కల్పించింది. అలాగే సాధారణ స్థాయి సదుపాయాలున్న ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. విక్రయ సంస్థకు ముందే జారీ చేసిన పేమెంట్ ఫోన్ నెంబర్‌కు ఫీచర్ ఫోన్ నుంచి డయల్ చేయడం ద్వారా ఈ చెల్లింపులు చేయవచ్చు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇదే అవకాశంగా తీసుకుని డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి కొత్త కొత్త ఐడియాలతో స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.