Central Mexico: 30 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో భారీ భూకంపం...అండగా ఉంటానన్న ట్రంప్!
- 1987 సెప్టెంబర్ 19న సంభవించిన భారీ భూకంపం
- అప్పట్లో పది వేల మంది మృతి
- ఇప్పుడు 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం
- పెరుగుతున్న మృతుల సంఖ్య
- అండగా ఉంటానన్న ట్రంప్
- ట్రంప్ బాటలో వివిధ దేశాల అధినేతలు
మెక్సికోలో సుమారు 30 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటన ఇప్పుడు పునరావృతమైంది. 1987 సెప్టెంబర్ 19న మెక్సికోలోని ఇదే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారు పదివేల మంది ప్రజలు సజీవసమాధి అయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు 7.4 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని భూకంపం మరోసారి పట్టికుదిపేసింది. ఇప్పటికే 140 మంది మృతి చెందినట్టు గుర్తించారు. శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. వేలాది మందికి గాయాలయ్యాయి. సహాయకచర్యలు వేగంగా జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భూకంపంపై స్పందించారు. మెక్సికోకు అండగా నిలుస్తామని చెబుతూ, ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. వివిధ దేశాధినేతలు కూడా దీనిపై స్పందించారు. మెక్సికో వేగంగా కోలుకోవాలని కాంక్షించారు. ప్యూబ్లా, మొర్లస్, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే సంభవించిన భూకంపం, తుపాను ధాటికి మెక్సికో ఇప్పటికే చితికిపోయింది. గోరుచుట్టుమీద రోకటి పోటులా వచ్చిన ఈ భూకంపం ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.