lamb: 'గణేశుడు - మాంసం' ప్రకటన విషయంలో హిందూవాదులకు చుక్కెదురు!
- కేసును కొట్టేసిన ఆస్ట్రేలియా అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ బ్యూరో
- తప్పుగా అర్థం చేసుకున్నారని ఉవాచ
- ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ప్రకటనలో లేదన్న బోర్డు
మాంసం ఉత్పత్తుల ప్రచారం కోసం హిందూ దేవుడు గణేశుడిని ఉపయోగించుకోవడంపై హిందూవాదులు ఆస్ట్రేలియా అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ బ్యూరో (ఏఎస్‌బీ)లో ఫిర్యాదు చేశారు. ప్రకటనలో గణేశుడిని చూపించిన విధానం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై వివిధ హిందూ గ్రూపుల నుంచి దాదాపు 200కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.
అయితే వీటన్నింటినీ ఏఎస్‌బీ కొట్టిపారేసింది. ఈ ప్రకటనలో ఏ ఒక్క దేవుణ్ని కించపరిచేలా చూపించలేదని, పైగా వివిధ వర్గాల దేవుళ్లందరూ కలిసి భోజనం చేస్తున్నట్లు చూపించడం ద్వారా మత వివక్షను తొలగించారని ఏఎస్‌బీ పేర్కొంది. అయినా హిందూ మతం మాంసం తినడానికి వ్యతిరేకం కాదని, వారు గోవును దైవంగా భావిస్తారు కాబట్టి కేవలం గోమాంసం మాత్రం తినవద్దని చెబుతుందని వెల్లడించింది. అలాగే ప్రకటన మేక మాంసానికి సంబంధించినదని, అందులో కూడా గణేశుడు తింటున్నట్లుగా ఎక్కడా చూపించలేదని తెలిపింది. అంతేకాకుండా ప్రకటనలో గణేశుడి పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఒక హిందువేనని, అన్నింటిని పరిశీలించిన తర్వాతనే ప్రకటన షూట్ చేసినట్లు సదరు ప్రకటనకర్తలు సమర్పించిన ఆధారాలను చూపించింది.