dmk: తమిళనాట రక్తికట్టిస్తున్న రాజకీయాలు..పావులు కదుపుతున్న డీఎంకే
- డీఎంకే నేటి సాయంత్రం అత్యవసర సమావేశం
- 86 మంది ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా
- మధ్యంతర ఎన్నికలకు వ్యూహం
- అనర్హత వేటుపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు
- అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ ను అత్యవసరంగా విచారించనున్న హైకోర్టు
అధికారమే లక్ష్యంగా డీఎంకే వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులు తమిళనాడు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలైన దినకరన్ వర్గంపై అనర్హత వేటు వేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింద ఆ పిటిషన్ ను స్వీకరించిన మద్రాసు హైకోర్టు రేపు ఆ పిటిషన్ ను విచారించనుంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం డీఎంకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తోంది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 86 మంది ఎమ్మెల్యేలతో స్టాలిన్ మూకుమ్మడి రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది. అలా చేయడం ద్వారా మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చని, దీంతో అన్నాడీఎంకేను ఓడించవచ్చని డీఎంకే వ్యూహం రచించింది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం డీఎంకే కార్యాలయంలో జరగనున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.