hani preet: హనీ ప్రీత్ కరెక్ట్ లొకేషన్ గుర్తింపు... భారత్ కు తరలించడమే తరువాయి!
- హనీప్రీత్ తో పాటు డేరాబాబా అనుచరుడు ఆదిత్య కూడా నేపాల్ లోనే
- నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో దాక్కున్న హనీప్రీత్
- నేపాల్ లో కూడా గుర్మిత్ రాం రహీంకు ఆశ్రమం
- అక్కడ కూడా బాబాకు భక్తజనం
డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ సహచరి, దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కరెక్ట్ లొకేషన్ ను హర్యానా సిట్ అధికారులు పట్టేశారు. సెప్టెంబర్ 2న నేపాల్ లోని ఖాట్మాండూ సమీపంలో ఆమె కనిపించిందని గుర్తించిన సిట్ అధికారులు, దానిని నిర్ధారించుకునేందుకు వేచి చూశారు. ఈ క్రమంలో నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో హనీప్రీత్ తలదాచుకున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆమెను పట్టుకుని భారత్ కు తీసుకురావడమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు గుర్మీత్ కు శిక్ష విధించిన సందర్భంగా హర్యానా, పంజాబ్ లలో చెలరేగిన అల్లర్ల వెనుక హనీప్రీత్, ప్రధాన అనుచరుడు ఆదిత్యల హస్తమున్నట్టు హర్యానా పోలీసులు చెబుతున్నారు.
వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే నేపాల్ నుంచి వారిని తీసుకురానున్నట్టు సమాచారం. కాగా, నేపాల్ లో కూడా గుర్మీత్ రాం రహీంకు భక్తులు ఉన్నారని తెలుస్తోంది. నేపాల్ భూకంపం సమయంలో గుర్మీత్ అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టారని సమాచారం. ఆ సమయంలో బాధితులను ఆదుకున్నారని, తరువాత అక్కడ కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారని, అందులో కూడా తమవైన భక్తి కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.