north korea: ఉత్తర కొరియాను చూసి భయపడుతున్న చైనా ప్రజలు
- ఉత్తర కొరియాపై చైనా అధికార ప్రతినిధి ఆగ్రహం
- తమపై కూడా దాడి చేస్తారనే భయంలో చైనా ప్రజలు
- ఉత్తర కొరియా ఉన్మాదంలో ఉందనే భావన
ఉత్తర కొరియాను చూసి జపాన్, దక్షిణ కొరియాలే కాకుండా చైనా ప్రజలు కూడా భయపడుతున్నారు. ఆ దేశం పేరును వింటేనే తమ ప్రజలు భయపడుతున్నారని చైనా అధికార ప్రతినిధి టీషేంగువా అన్నారు. ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ఉత్తర చైనా సరిహద్దుల గుండా ప్రయాణించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మిస్సైల్ ప్రయోగం చేసిన ఉత్తర కొరియా... తమ ప్రజలను కూడా భయపెట్టాలని చూసిందని అన్నారు.
చైనా ప్రజలు కూడా ఉత్తర కొరియా పట్ల మండిపడుతున్నారు. తమ పొరుగునే శత్రువు పెరిగిపోతున్నాడని... ఏదో ఒక రోజు చైనాపై కూడా దాడికి తెగిస్తాడని జూహో అనే చైనా పౌరుడు అన్నాడు. ఉత్తర కొరియాతో చైనా ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన తెలిపాడు. ఉత్తర కొరియా తమకు మంచి స్నేహితుడనే ప్రపంచం మొత్తం భావిస్తోందని... అయితే, ఆ దేశం చేస్తున్న అణు, క్షిపణి ప్రయోగాలు తమను కలవరపాటుకు గురి చేస్తున్నాయని అన్నాడు. కత్తి పట్టుకున్న ఉన్మాది ఎవరైనా సరే... పొరుగు వారికి గాయం చేయకుండా ఊరుకోడని చెప్పాడు. ప్రస్తుతం ఉత్తర కొరియా ఉన్మాదంతో ముందుకు సాగుతోందని... అది చైనాకు కూడా ప్రమాదమేనని అన్నాడు.