rahul gandhi: మళ్లీ 'తప్పు'లో కాలేసిన రాహుల్ గాంధీ!
- అర్జన్ సింగ్ ను 'ఎయిర్ మార్షల్' అన్న రాహుల్
- కనీస పరిజ్ఞానం లేకుండా పోయిందని కామెంట్లు
- ఇటీవలే ఎంపీల సంఖ్యను తప్పుగా చెప్పిన కాంగ్రెస్ నేత
- మరోసారి బీజేపీకి విమర్శించే అవకాశం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరోసారి తన పొరపాటుతో విపక్షాలు విమర్శలకు దిగే అవకాశాన్ని ఇచ్చారు. నిన్న మరణించిన 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ కు సంతాపం తెలుపుతూ ఆయన్ను 'ఎయిర్ మార్షల్'గా సంబోధించారు. ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ మరణం తనకెంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆయన నిజమైన హీరో అని, ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' వంటి ఘనమైన హోదాను కలిగివున్న ఆయన్ను 'ఎయిర్ మార్షల్'గా చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కామెంట్లు వస్తున్నాయి. వాస్తవానికి భారత వాయు సేనలో 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' ఫైవ్ స్టార్ ర్యాంకు కాగా, 'ఎయిర్ మార్షల్' త్రీ స్టార్ ర్యాంకు. వాయుసేనపై కనీస అవగాహన లేకుండా రాహుల్ మాట్లాడారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం లోక్ సభ సభ్యుల సంఖ్యను ఆయన తప్పుగా అభివర్ణించి విమర్శలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు బెంగళూరులో 'ఇందిరా క్యాంటీన్'లను ప్రారంభిస్తూ, వాటిని 'అమ్మ క్యాంటీన్'గా పేర్కొని విమర్శల పాలయ్యారు.