lashkar-e-toiba: ఉగ్రవాది మృతదేహాన్ని అవమానించిన జవాన్లు... ప్రతీకారం తీర్చుకుంటామని లష్కరే తోయిబా హెచ్చరిక!
- కనీస మానవత్వం కూడా చూపించరా?
- ఇండియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే
- లష్కరే తోయిబా ప్రతినిధి మెహమూద్ హెచ్చరిక
గత వారంలో జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులు అబూ ఇస్మాయిల్, చోటా ఖాసిమ్ ల మృతదేహాలను భారత జవాన్లు అవమానించారని పాక్ ఆరోపించింది. మరణించిన వారి పట్ల కనీస మానవత్వం కూడా చూపకుండా వారి కాళ్లకు తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారని, చనిపోయిన వారి గుండెలపై తన్నుతూ పైశాచికానందాన్ని పొందారని లష్కరే తోయిబా ఉగ్రవాది మెహమూద్ షా ఆరోపించాడు. ఇందుకు భారత సైన్యంపై పగ తీర్చుకుని తీరుతామని, ఇండియా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.
కాగా, అభూ ఇస్మాయిల్, చోటా ఖాసిమ్ ల దేహాలను ఈడ్చుకుంటూ వెళుతున్న దృశ్యాల వీడియో వెలుగులోకి రావడంతో ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలుంటాయని రక్షణ శాఖ ప్రతినిధి కల్నర్ రాజేష్ కాలియా పేర్కొన్నారు. సదరు వీడియోను తాను కూడా చూశానని, జవాన్లు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నౌహట్టా, గోజ్వారా, బోహ్రీ కాదల్, రాజౌరీ తదితర ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేసి, అదనపు బలగాలను మోహరించారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర కొనసాగుతున్న వేళ, భక్తులపై దాడికి దిగిన ఘటనలో మాస్టర్ మైండ్ అబూ ఇస్మాయిలేనని అధికారులు స్పష్టం చేశారు.