bit coin: నరేంద్ర మోదీ మరో ప్రయోగం... బిట్ కాయిన్ వంటి రహస్య కరెన్సీ దిశగా ఇండియా!
- 'లక్ష్మి' పేరిట విడుదల చేద్దామని మోదీ సర్కారు ప్రతిపాదన
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలనలో రహస్య కరెన్సీ
- ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మరింత పారదర్శకత కోసమే
- తమకు ప్రతిపాదన అందిందన్న ఆర్బీఐ ఈడీ సుదర్శన్ సేన్
- ఆలోచన మాత్రం నచ్చలేదని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా రహస్య కరెన్సీగా గుర్తింపు పొందిన బిట్ కాయిన్ తరహాలో 'లక్ష్మి' పేరిట సొంత క్రిప్టో కరెన్సీని తేవాలని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ విషయమై చర్చించారని, ఆర్థిక వ్యవహారాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చే దిశగా సొంత బిట్ కాయిన్స్ ఉంటే మేలని అధికారులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఈ కరెన్సీని సులువుగానే నిర్వహించవచ్చని, అయితే, కరెన్సీ చట్టాల్లో సవరణలతోనే ఇది సాధ్యమని వారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ప్రతిపాదనల రూపంలో ఉన్న స్వీయ రహస్య కరెన్సీ చలామణిలోకి రావాలంటే మరింత సమయం పడుతుందనడంలో సందేహం లేదు.
ఇక ఈ వార్తలపై నితీశ్ దేశాయ్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు వైభవ్ పారిఖ్ స్పందిస్తూ, ఈ తరహా ఆలోచనే చాలా వినూత్నంగా ఉందని, బ్యాంకుల కార్యకలాపాలు, ఫైనాన్షియల్ డీల్స్ తదితరాల్లో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. కాగా, ప్రస్తుతం ఎస్తోనియా, రష్యా, చైనా తదితర దేశాల్లో క్రిప్టో కరెన్సీ విధానం అమల్లో ఉంది. ప్రభుత్వం నుంచి సూచన ప్రాయంగా ఈ ప్రతిపాదన తమకు వచ్చిందని ఆర్బీఐ ఈడీ సుదర్శన్ సేన్ వెల్లడించారు. తమకు మాత్రం ఈ ఆలోచన ఏమంత నచ్చలేదని తెలిపారు.
ఇదిలావుండగా, ఇండియాలో బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ యాప్ 'జెట్ పే' ఇప్పటివరకూ ఐదు లక్షల మంది స్మార్ట్ ఫోన్లలో చేరిపోయింది. నిత్యమూ కనీసం 2,500 మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటుండగా, నెలాఖరుకు 10 లక్షల మంది కస్టమర్లకు చేరుకుంటామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ తరహా డీల్స్ చేసుకునేవారు సొంతంగా రిస్క్ ను భరిస్తున్నట్టేనని గతంలో హెచ్చరించిన రిజర్వ్ బ్యాంక్, తాజా మోదీ సర్కారు ప్రతిపాదనలపై ఎలాంటి తుది నిర్ణయానికి వస్తుందనేది స్పష్టం కావాల్సి వుంది.