chanchal guda: చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదుల ప్లాన్ విఫలం!
- జైలు సిబ్బందిపై దాడికి దిగిన ముగ్గురు ఉగ్రవాదులు
- ములాఖత్ సమయంలో దాడి చేసి బయటకు పరుగు
- గేటు దాటకుండానే నిలువరించిన జైలు సిబ్బంది
- తప్పిన పెను ప్రమాదం
చంచల్ గూడా జైలులో సిబ్బంది కొరత, కొరవడిన నిఘా, భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహమ్మద్ అతుల్లా రహమాన్, మహమ్మద్ అతుల్లా యజ్దానీలు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. వారి ప్రణాళిక కొద్ది క్షణాల్లో సక్సెస్ అయి, వారు గేటు దాటతారనగా, అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించగలిగారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ముగ్గురు ఖైదీలూ శనివారం నాడు ములాఖత్ లో భాగంగా తమ కుటుంబీకులను కలుసుకున్నారు. వారిచ్చిన వస్తువులను జైలు రెండో ప్రహరీ గోడకు ఉండే గేటు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా, వారిపై దాడికి దిగి, అక్కడి నుంచి మెయిన్ గేటు వరకూ పరుగందుకున్నారు. అప్పటికి ప్రధాన ద్వారం తెరచే ఉండగా, ఉగ్రవాదుల పరుగును చూసిన సిబ్బంది, వెంటనే దాన్ని మూసి వేయడంతో వారి పన్నాగం పారలేదు.
కరుడుగట్టిన ఉగ్రవాదులు తప్పించుకోవాలని చూడగా, దాన్ని పోలీసులు నిలువరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. రెండో గేటు, మొదటి గేటు మధ్య ఉన్న సిబ్బంది వారిని సమర్థవంతంగా నిలువరించారని, ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కు గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. గడచిన 14 నెలలుగా ఈ ముగ్గురూ చంచల్ గూడ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ ముగ్గురిపై తప్పించుకునే ప్రయత్నం చేశారన్న మరో కేసును నమోదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఒకవేళ యజ్దానీ బ్రదర్స్ వేసిన ప్లాన్ వర్కవుట్ అయివుంటే, జైలు ప్రధాన గేటు దాటగానే, వారు అత్యంత సులువుగా తప్పించుకుని ఉండేవాళ్లు. ఎందుకంటే, ఈ జైలు బయటకు వస్తే, ఎడమవైపు సైదాబాద్, కుడివైపు చార్మినార్, హైకోర్టు తదితరాలుండే ప్రాంతానికి చేరుకోవచ్చు. పాతబస్తీలోకి వెళితే, వీరిని గుర్తించడం అంత సులువైన పని కూడా అయ్యుండేది కాదు. ఆపై వీరు సులువుగా దేశంలోని మరో ప్రాంతానికి వెళ్లి, తమ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించి వుండేవారు. ఏదిఏమైనా వారి ప్రయత్నం విఫలం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.