cricket: టీమిండియా, ఆసిస్ దిగ్గజాల సమరం నేడే ప్రారంభం!
- చెన్నైలో 1.30 గంటల నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్
- 4-1 తేడాతో ఇండియా గెలిస్తే ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి
- ఆస్ట్రేలియాకు దూరమైన ఆరోన్ ఫించ్
- గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న ఇరు జట్లు
ఇటీవల శ్రీలంకలో జరిగిన పర్యటనలో అన్ని ఫార్మాట్లలో తిరుగులేని విజయాలు సాధించి ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు ముందు, ఇప్పుడు బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియా రూపంలో ఎదురైంది. సమవుజ్జీ అయిన ప్రత్యర్థితో నేటి నుంచి కొత్త సిరీస్ మొదలు కానుండగా, క్రికెట్ అభిమానులకు సరికొత్త మజా లభిస్తుందనడంలో సందేహం లేదు. నేడు ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి వన్డే జరుగనుండగా, ఈ సిరీస్ ఫలితం నంబర్ వన్ ర్యాంకును ప్రభావితం చేయనుంది. ఈ సిరీస్ ను 4-1 తేడాతో ఏదైనా జట్టు గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 3-2, లేదా 2-3 తేడాతో గెలుపోటములు ఉంటే ప్రస్తుత ర్యాంకులు కొనసాగుతాయి.
కాగా, ఇటీవలి కాలంలో భారత్, ఆస్ట్రేలియాలు ఎప్పుడు తలపడినా 300కు పైగా భారీ స్కోర్లు నమోదవుతూ రావడం, ఛేదనలో సైతం టీమిండియా 350 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుండటంతో ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంగా ఆస్ట్రేలియా జట్టు విదేశీ రికార్డులు అంత తృప్తికరంగా లేకున్నా, ఇక్కడి పిచ్ లపై వారికి ఉన్న అనుభవం కారణంగా ఆటగాళ్లను తక్కువ అంచనా వేస్తే మాత్రం నష్టపోయే అవకాశాలే ఎక్కువ. రెండు జట్లలో బ్యాటింగ్ పరంగా చూస్తే, ఆస్ట్రేలియానే మెరుగ్గా కనిపిస్తూ ఉంది.
ఇదే సమయంలో స్మిత్, వార్నర్, మాక్స్ వెల్ తదితర బౌలర్లు భారత ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్ కి అరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కానుండటంతో ఇండియాకు కొంత ఊరట లభించినట్లయింది. టీమిండియాకు శిఖర్ ధావన్ దూరం కావడంతో, ఇటీవలి కాలంలో అంత ఫామ్ లో లేని రహానే ఓపెనింగ్ కు దిగనున్నాడు. భారత మిడిల్ ఆర్డర్ మాత్రం మిగతా అన్ని దేశాల కన్నా బలంగా కనిపిస్తోంది. ఆపై 7, 8 స్థానాల్లో భువనేశ్వర్, పాండ్యా వంటి బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండటం ప్లస్ పాయింట్. ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్ నేడు మధ్యాహ్నం చెన్నైలో జరగనుంది. 1.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ ని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.