ganguly: సెహ్వాగ్, ఏంటా మాటలు?.. వీరూ ‘సెట్టింగ్’ వ్యాఖ్యలపై దాదా ఆగ్రహం
- సెహ్వాగ్‌వి తెలివి తక్కువ వ్యాఖ్యలు
- భారత్-ఆసీస్ రెండో వన్డేకు ఈడెన్ సన్నద్ధం
- టికెట్లు అమ్ముడుపోయాయన్న దాదా
టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘సెట్టింగ్’ వ్యాఖ్యలపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా మాట్లాడడం సరికాదని మందలించాడు. ‘‘ఇందులో చెప్పడానికేం లేదు. సెహ్వాగ్ ఫూలిష్‌గా మాట్లాడాడు’’ అని పేర్కొన్నాడు. రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన క్రికెట్ అడ్వైజరీ కమిటీలో దాదా కూడా సభ్యుడే.
రెండు రోజుల క్రితం సెహ్వాగ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నా, బీసీసీఐ పెద్దలతో ‘సెట్టింగ్‘ (సాన్నిహిత్యం) లేకపోవడం వల్లే తనకు ఆ పదవి దక్కలేదని వ్యాఖ్యానించి కలకలం రేపాడు.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన గంగూలీ ఈ విషయమై ఇంతకు మించి మాట్లాడేందుకు నిరాకరించాడు. దుర్గా పూజా నేపథ్యంలో ఈనెల 21న భారత్-ఆసీస్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరగనున్న వన్డేపై కొంత సందిగ్ధత నెలకొంది. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈడెన్ సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 25 వేల కాంప్లిమెంటరీ టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపాడు. అలాగే మొత్తం 30 వేల టికెట్లలో 15 వేల టికెట్లను విక్రయించినట్టు గంగూలీ పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు 19న మహాలయతో దుర్గా పూజ ప్రారంభం కానుంది.