sardar sarovar dam: 56 ఏళ్ల నిరీక్షణకు తెర... నేడు సర్దార్ సరోవర్ డ్యామ్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

  • డ్యామ్ నిర్మాణానికి ఆలోచన చేసిన వల్లభాయ్ పటేల్
  • 1961లో శంకుస్థాపన చేసిన నెహ్రూ 
  • నిర్మాణానికి రూ. 65 వేల కోట్ల ఖర్చు
  • నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం
  • 86 వేల ఎకరాలకు సాగునీరు, నాలుగు కోట్ల మందికి తాగునీరు
  • ఒకసారి నిండితే ఆరేళ్లకు సరిపడా నీటి నిల్వ
  • దేశంలోనే రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు

దేశంలో మరో బృహత్తర ప్రాజెక్టు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకగా, గుజరాత్ వాసులకు సర్దార్ సరోవర్ డ్యామ్ ను ఇవ్వనున్నారు. నేడు ఇభోయీ నుంచి వడోదరా వరకూ భారీ ర్యాలీని నిర్వహించి, ఆపై డ్యామ్ వద్దకు చేరే ప్రధాని, 10 నుంచి 15 నిమిషాల పాటు గేట్లను తెరవనున్నారు. రైతులకు సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని అందించనున్నారు. 138.68 మీటర్ల ఎత్తున నిర్మితమైన ఈ డ్యామ్ నర్మదా నదిపై ఉన్న 30 ఆనకట్టలలో అత్యంత కీలకమైనది. ఇది పూర్తిగా నిండితే దాదాపు 6 సంవత్సరాల పాటు సాగు, తాగు నీరు లభించనుంది.

దీని నిర్మాణానికి 1945లో సర్దార్ వల్లభాయి పటేల్ ఆలోచన చేశారు. ముంబైకి చెందిన ప్రముఖ ఇంజనీర్ జమ్దేశ్ జీ దీనికి ప్లాన్ ఇవ్వగా, నర్మద జిల్లా కెవాడియాలో 1961 ఏప్రిల్ 15న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి డ్యామ్ పూర్తి కావడానికి ఇంతకాలం పట్టింది. దీని నిర్మాణానికి సుమారు రూ. 65 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టుతో గుజరాత్ వాసుల నీటి కొరత తీరుతుందని ప్రధాని వెల్లడించారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టు కాగా, గుజరాత్ తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు ప్రయోజనం కలగనుంది. సుమారు 86,088 ఎకరాలకు సాగునీరు, 4 కోట్ల మందికి తాగునీరు అందుతుంది.

  • Loading...

More Telugu News