cancer: కేన్సర్ కణాల శక్తి కేంద్రాన్ని నాశనం చేసే సమ్మేళనాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
- వార్‌బర్గ్ ప్రభావం సహాయంతో అభివృద్ధి
- కోనిన్‌జిక్ ఆమ్లం (కేఏ)గా గుర్తింపు
- ఎలుకలపై విజయవంతం
కేన్సర్ కణాలు విభజన శక్తి కోసం గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయని ముప్పై ఏళ్లక్రితం వార్‌బర్గ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. దీన్ని `వార్‌బర్గ్ ఎఫెక్ట్` అంటారు. ఈ ప్రభావాన్ని మరింత అభివృద్ధి చేసి కేన్సర్ కణాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకోకుండా చేసే ఓ రసాయన మూలకాన్ని డ్యూక్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వార్‌బర్గ్ చెప్పిన ప్రకారం కణాలు ఆక్సిజన్ సాయంతో చక్కెరలను విడగొట్టి శక్తిని పొందుతుంటే...కేన్సర్ కణాలు చక్కెరలను పులియబెడతాయనే విషయాన్ని పరిశోధించి ఇలా పులియబెట్టగల శక్తిని నియంత్రించడానికి జీఏడీపీహెచ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుందని గుర్తించారు.
దీన్ని కట్టడి చేయడం ద్వారా కేన్సర్ కణాలకు శక్తి లభించకుండా చేయవచ్చని తెలుసుకున్నారు. ఇందుకోసం కోనిన్‌జిక్ ఆమ్లం (కేఏ) అనే రసాయనాన్ని వాడుకోవచ్చని గుర్తించారు. కార్బోహైడ్రేట్ పదార్థాల్లో గ్లూకోజ్‌ను బ్యాక్టీరియా తీసుకెళ్లిపోకుండా అడ్డుకునేందుకు ఒక రకమైన శిలీంధ్రం ఈ కేఏను ఉత్పత్తి చేస్తుంది. ఇదే కేఏను కేన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా చేసేందుకు వారు ఉపయోగించారు. దీన్ని ఉపయోగిస్తూ ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో డ్యూక్ శాస్త్రవేత్తలు కేఏ ఉత్పత్తిని పెంపొందించే పనిలో పడ్డారు.