salman khan: సల్మాన్ ఖాన్ ను ఘనంగా సత్కరించిన బ్రిటన్ పార్లమెంట్!
- సల్మాన్ కు గ్లోబల్ డైవర్శిటీ అవార్డు
- సత్కరించిన ఆసియా సంతతి ఎంపీ కీత్ వాజ్
- సల్మాన్ మానవతావాదని పొగడ్తలు
- అవార్డుకు అర్హుడని వ్యాఖ్యానించిన కీత్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఘనంగా సత్కరించింది. శుక్రవారం నాడు పార్లమెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల్లో అత్యధిక కాలం పాటు సేవలందించిన ఆసియన్ సంతతి ఎంపీ కీత్ వాజ్ సల్మాన్ ను 'గ్లోబల్ డైవర్శిటీ అవార్డు'నిచ్చి సత్కరించారు. ప్రపంచంలో ఏ రంగంలోనైనా వివిధీకరణకు కృషి చేస్తున్న వారికి ఈ అవార్డును అందిస్తామని, దానికి సల్మాన్ అర్హుడని ఈ సందర్భంగా కీత్ వాజ్ వ్యాఖ్యానించారు.
భారత సినిమాకు మాత్రమే సల్మాన్ సూపర్ స్టార్ కాదని, ప్రపంచ సినీ రంగంలో ఆయనకు ఎంతో పేరుందని, మానవతావాదిగా, ఉదారవాదిగా ఆయన ఎన్నో పనులు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవం తనకు ఇవ్వడం పట్ల బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ధన్యవాదాలు చెప్పారు. ఇటువంటి అవార్డు తనకు వస్తుందని తన తండ్రి కూడా భావించి ఉండడని వ్యాఖ్యానించారు. కాగా, దాదాపు దశాబ్దం తరువాత సల్మాన్ ఖాన్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. తన 'దబాంగ్' టూర్ లో భాగంగా నేడు బర్మింగ్ హామ్, ఓ2 ఎరీనా తదితర ప్రాంతాల్లో సోనాక్షీ సిన్హా, జాక్వలిన్ ఫెర్నాండెజ్, ప్రభుదేవా, సూరజ్ పాంచోలీ తదితరులతో కలసి ఆయన ప్రదర్శన నిర్వహించనున్నారు.