London: లండన్ లో అతి పెద్ద భారత జాతీయపతాకం ఆవిష్కరణ.. తరలి వచ్చిన వేలాది భారతీయ కుటుంబాలు
- వేడుకగా స్వాతంత్ర్యదిన వేడుకలు
- 51 మీటర్ల జెండా ఆవిష్కరణ
- సిరిసిల్ల చేనేతకు గౌరవం
- చేనేత ఉన్నతికి తెలంగాణ ఎన్నారై ఫోరం మద్దతు
- అలరించిన 80 స్టాల్స్
యూకేలోని భారతీయ హైకమిషన్, తెలంగాణ ఎన్నారై ఫోరం, భారత కమ్యూనిటీలు ఈనెల 10వ తేదీన భారత 70వ స్వాతంత్ర్య దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లండన్ లోని ఇండియన్ జింఖానా క్లబ్ గ్రౌండ్స్ లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారుచేసిన భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 51.2 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉన్న జాతీయ జెండాను హైకమిషనర్ వైకే సిన్హా ఆవిష్కరించారు. మన దేశం వెలుపల ఆవిష్కరించిన అతి పెద్ద జాతీయ జెండా ఇదే కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే, జాతీయ జెండా కోడ్ కు అనుగుణంగానే జాతీయ పతాకాన్ని తయారు చేశారు.
ఈ కార్యక్రమానికి యూకేలో ఉన్న వేలాది మంది భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 80 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాల స్టాల్స్ నోరూరించే వంటకాలను అందించాయి. భారతీయ మూలాలున్న బ్రిటీష్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, ఏఎస్ రాజన్ లతో పాటు పలువురు స్థానిక ఎంపీలు స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకులు గంప వేణు, అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గోలి తిరుపతి, జనరల్ సెక్రెటరీ సుధాకర్ రంగుల, నాగేష్ రెడ్డి కాసర్ల, అడ్వైజరీ హెడ్ ప్రమోద్ అంతాటి, ట్రెజరర్లు నరేష్ మరియాల, వెంకట్ రంగు, జాయింట్ సెక్రటరీలు భాస్కర్ పిట్ల, సురేష్ గోపాటి, క్రీడల ఇన్ ఛార్జ్ పిట్ల ఏలేందర్, స్పాన్సర్ ఇన్ ఛార్జ్ భాస్కర్ మొట్టా, అశోక్ మేడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీధర్ నీల, వీరు చౌదరి, సతీష్ వాసిరెడ్డి, సంతోష్ ఆకుల, ఉమెన్ సెల్ సభ్యులు మీనాక్షి అంతాటి, జ్యోతి కాసర్ల, ప్రీతి నోముల, శిరీష చౌదరి, కవిత గోలి, వాణి అన్సూరి, రమాదేవి, రజిత నీల తదితరులు హాజరయ్యారు.
గత ఏడాది కాలంగా తెలంగాణ చేనేత కార్మికుల ఉన్నతి కోసం తెలంగాణ ఎన్నారై ఫోరం కృషి చేస్తోంది. యూకే వ్యాప్తంగా చేనేత కార్మికుల ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తోంది.