Tamilnadu: తమిళనాడులో కొత్త టెన్షన్.. కొత్త సీఎం, హోంశాఖ, అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు నోటీసులు
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త ఉత్కంఠ మొదలైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఫిబ్రవరి 18న జరిగిన బల పరీక్ష చెల్లదంటూ డీఎంకే వేసిన పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు సోమవారం.. కొత్త సీఎం పళనిస్వామితో పాటు ఆ రాష్ట్ర హోం శాఖకు, అసెంబ్లీ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. ఆ రోజున శాసనసభ నుంచి విపక్షం మొత్తాన్ని బయటకు పంపి, బలపరీక్ష నిర్వహించారంటూ ఐదు రోజుల కింద డీఎంకే నేత స్టాలిన్ ఈ పిటిషన్ వేశారు. అంతేగాకుండా బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలను నిర్బంధించి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఒత్తిడి చేశారని అందులో హైకోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.