cricket: మరో అరుదైన రికార్డును నెలకొల్పిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ రోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచులో కోహ్లీ శతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టెస్టుల్లో తానాడిన ప్రతి ప్రత్యర్థి జట్లపై సెంచరీ సాధించాడు. అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శిస్తోన్న కోహ్లీ.. బంగ్లాతో మ్యాచ్ ప్రారంభం కాక ముందు వరకు తాను ఆడిన టెస్ట్ హోదా ఉన్న ఆరు జట్లపై సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో తాను ఆడిన ఏడు దేశాలపై సెంచరీ చేసిన రికార్డును నెలకొల్పాడు. అంతేగాక, ఓ సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీ మరో 31 పరుగుల దూరంలో ఉన్నాడు. 2004-05 సీజన్‌లో సెహ్వాగ్ 17 మ్యాచ్ లాడి 4 శతకాలు, మూడు అర్ధశతకాలతో 1105 పరుగులు చేశాడు. కాగా, 2016-17 సీజన్‌లో 15 టెస్టులాడిన కోహ్లీ 4 శతకాలు, 2 అర్ధ శతకాలతో 1075 పరుగులు చేశాడు.