trump: డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేసి చాలా గౌరవంగా మాట్లాడారు: న్యూజిలాండ్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎవరిమాటా వినకుండా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన నిర్ణయాలను వ్యతిరేకించిన జడ్జితో పాటు అస్ట్రేలియా ప్రధానిని కూడా విమర్శించారు. అయితే, నిన్న న్యూజిలాండ్ దేశ ప్రధాని బిల్ ఇంగ్లిష్‌తో మాత్రం ఆయన ఎంతో సున్నితంగా మాట్లాడారట. తనకు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని న్యూజిలాండ్ ప్రధాని తెలుపుతూ అందుకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. అమెరికాలో విధించిన శరణార్థులపై ఆంక్షల విషయంతో పాటు పలు విషయాలను తాము 15 నిమిషాలు మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్‌తో ఈ చర్చ గౌరవప్రదంగా, సామరస్యపూర్వకంగా జరిగాయని బిల్ ఇంగ్లిష్ తెలిపారు. శరణార్థులపై నిషేధం విధించాలన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో తాను ఏకీభవించలేదని ఆయన తెలిపారు. తమ దేశానికి, అమెరికాకు మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. చైనా, ఉత్తర కొరియా దేశాల విషయంలో కూడా తనతో ట్రంప్ చర్చించారని న్యూజిలాండ్ ప్రధాని అన్నారు. ఈ విషయంపై శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేస్తూ... అంతర్జాతీయ భద్రతకు, శాంతికి న్యూజిలాండ్ పాటుపడుతోందని తెలిపింది. న్యూజిలాండ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పింది.