trump: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా మిన్నంటుతున్న నిరసనలు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించకుండా తీసుకుంటున్న చర్యలతో అమెరికాలో నిరసన ప్రదర్శనలు అధికమవుతున్నాయి. ప్రతిరోజు రద్దీగా ఉండే ప్రదేశాలు, రహదారులు, విమానాశ్రయాల ప్రాంగణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేబడుతూ, ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు నినదిస్తూ, ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని నినాదాలు చేస్తున్నారు.
వలసదారులు, శరణార్థులు అమెరికాకు నిర్భయంగా రావచ్చని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నిన్న ఆ దేశంలోని విమానాశ్రయాల లోపల మొత్తం ఖాళీ ఏర్పడగా, బయటమాత్రం వేలమంది నిరసనకారులతో రద్దీగా మారింది. లాస్ ఎంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, డల్లాస్, న్యూయార్క్ జేఎఫ్ కెన్నడీ, రాలేగ్, హ్యూస్టన్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లోని టర్మినల్స్ వద్ద ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమెరికాలో ఎవరికీ వ్యతిరేకంగా ద్వేషం లేదని, వారు భయపడకూడదని, వలసదారులకు తాము స్వాగతం పలుకుతున్నామని వారు అంటున్నారు. మరోవైపు జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండురోజుల క్రితం నిర్బందించిన ఇద్దరు ఇరాకీయులను వదిలేశారు.