trump: 'ఇప్పుడు ఇక్కడ ట్రంప్ వచ్చేశారు... మీ ముస్లింలను తరిమేస్తాడు' అంటూ మహిళపై దాడి
అమెరికాలో ముస్లింల ప్రవేశానికి అడ్డుకట్ట వేయడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అదే అదునుగా ఆయన అభిమానులు రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ ముస్లిం మహిళపై దాడికి దిగడంతో ఆమె కుడికాలికి గాయాలయ్యాయి. డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ ఘటన గురించి వివరిస్తూ... రాబిన్ రోడ్స్ ( 57) అనే వ్యక్తి ఇటీవలే ఆ విమానాశ్రయానికి వచ్చాడని చెప్పారు.
ఆ వ్యక్తి మసాచుసెట్స్ వెళ్లేందుకు కనెక్టింగ్ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నాడని, అయితే అతడి ప్రవర్తన తమకు విచిత్రంగా కనిపించిందని చెప్పారు. అతడు డెల్టా స్కై ఎయిర్ పోర్టులో మహిళా సిబ్బంది రబీయా ఖాన్ ఛాంబర్ కు వెళ్లాడని, అనంతరం ఆమెతో ఇక్కడ పనిచేస్తున్నావా? లేక నిద్రపోతున్నావా? అని అనుచిత వ్యాఖ్యలు చేశాడని అన్నారు. ఆయనను సదరు మహిళ రబీయా ప్రశ్నించగా ఆ వ్యక్తి సమాధానంగా, 'ఇప్పుడు ఇక్కడ ట్రంప్ వచ్చేశారు. మీ ముస్లింలను తరిమేస్తాడు' అంటూ పలు వ్యాఖ్యలు చేశాడని చెప్పారు.
దీంతో ఆ మహిళ అక్కడినుంచి వెళ్లిపోవాలని చూసిందని, దీంతో ఆ వ్యక్తి జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ లో జరిగిన ఘటనలు ఇక్కడ కూడా పునరావృతం అవుతాయని హెచ్చరించాడని అక్కడి సిబ్బంది చెప్పారు. అనంతరం రాబిన్ రోడ్స్ ను తాము అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.