special status: ఈ ఐదు ప్రశ్నలకు చంద్ర‌బాబు సమాధానం చెప్పగలిగితే.. నేనిక ఇంకెప్పుడూ ఆయ‌న‌ను ప్ర‌శ్నించను: శివాజీ


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అంశం మ‌రోసారి పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌చ్చిన నేప‌థ్యంలో హోదా కోసం పోరాడుతున్న వారు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సినీన‌టుడు, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత శివాజీ సామాజిక మాధ్య‌మాల్లో హోదా అంశాన్ని ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబు నాయుడిని ఐదు ప్ర‌శ్న‌లు అడుగుతూ రెండు వీడియోలు పోస్ట్ చేశారు. ఈ ఐదు ప్రశ్నలకు చంద్ర‌బాబు సూటిగా సమాధానం చెప్పగలిగితే, ఈ రోజు నుంచి ఇంకెప్పుడూ ఆయ‌న‌ను ప్ర‌శ్నించబోన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

మొట్టమొదటి ప్రశ్నగా 'మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టిన రైతు రుణమాఫీని పూర్తిగా చేయగలిగారా?' అని శివాజీ ప్ర‌శ్నించారు. అస‌లు త‌మ‌కు రుణమాఫీ కావాలని రైతులు మిమ్మల్ని అడిగారా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌... ఆ అంశాన్ని చంద్ర‌బాబు మానిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. ఆ రోజు ప్రజలు చంద్ర‌బాబుని అలా చేయమని అడ‌గ‌లేదు క‌దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక రెండో ప్ర‌శ్న‌గా.. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కాపు వ‌ర్గానికి రిజర్వేషన్‌ కల్పించాల‌ని కాపు కులం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా? ఆ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టండి అని అడిగారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు ఆ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టారని, దాన్నే నెర‌వేర్చాల‌ని కాపులు ప్రశ్నిస్తున్నారని శివాజీ అన్నారు. మీ ఉద్దేశం ఏదైనా కానీ మీరు పెట్టారా? లేదా? అని శివాజీ అన్నారు. మ‌రి ఇప్పుడు ఆ హామీని మీరు చేయగలుగుతున్నారా? అని అడిగారు. ఒకవేళ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెట్టే ముందే బీసీ సంఘాలను ఒప్పించారా? అని ప్ర‌శ్నించారు. ఈ అంశం రెండు కులాలకు మధ్య చిచ్చుపెట్టడమే కదా? అని అన్నారు. ఆ హామీ ఎందుకు ఇచ్చారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మూడ‌వ ప్ర‌శ్న‌గా... ప్రత్యేక హోదా గురించి ఆరోజు తిరుపతిలో చంద్ర‌బాబుతో పాటు బీజేపీ నేత‌ వెంకయ్యనాయుడు క‌లిసి ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని గుర్తించారు. పదేళ్లు కాదు పదిహేనేళ్లు ప్ర‌త్యేక‌హోదా కావాలని వారు వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. ప్రత్యేక హోదా కావాల‌ని, లేక‌పోతే రాష్ట్రం ఎందుకు పనికి రాదని మిమ్మల్ని ప్రజలు అడిగారా? అని శివాజీ ప్ర‌శ్నించారు. ఆనాడు అధికారం కోసం హామీలు గుప్పించార‌ని, మరి ఈ రోజు దీనికి సమాధానం చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక మిగ‌తా ప్ర‌శ్న‌లుగా నిరుద్యోగం, విద్యావ్య‌వ‌స్థ‌ల‌పై శివాజీ గ‌ళ‌మెత్తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు వస్తే జాబు వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని గోడలమీద రాశారని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పార‌ని పేర్కొన్న ఆయ‌న‌... ఎవరికి ఉద్యోగాలు వచ్చాయని, ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చారని అన్నారు. సాధ్యంకాని హామీలు చంద్ర‌బాబు మానిఫెస్టోలో ఎలా పెడతార‌ని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న జ‌రిగిన‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ జనాభా ఎంతో ఆర్థిక వనరులు ఏ పాటివో చంద్ర‌బాబుకి తెలుసని, అయినా ఎందుకు హామీ ఇచ్చారని ఆయ‌న అన్నారు. ఈ రోజున ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ అయ్యా మీరు చెప్పినవి చేయండని అడిగితే.. అభివృద్ధి నిరోధకులు అంటున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎవరు అభివృద్ధి నిరోధకులని శివాజీ ప్ర‌శ్నించారు. ఎవరు చేతగాని హామీలు ఇవ్వమన్నారని చంద్ర‌బాబుని నిల‌దీశారు. ఈ రోజు అవినీతి ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలోని ఏ నియోజక వర్గంలోకైనా వెళ్లి అయినా అడగండని సూచించారు. ఇదా ప్రజలు మీ నుంచి కోరుకున్న‌ది ? అని ఆయ‌న అడిగారు. చెయ్యగలిగినవి మాత్ర‌మే మానిఫెస్టోలో పెట్టాల‌ని సూచించారు. ఏ రాజకీయ పార్టీ అయినా చేయలేని అంశాలను పెట్టొద్దని అయ‌న అన్నారు. రాష్ట్రంలో పిల్లలకి సరైన పాఠశాలలు ఉన్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సరైన మైదానాలు.. నాణ్య‌త‌తో కూడి విద్య ఇస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాసుప‌త్రులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News